Here are Virat Kohli Records After India vs Sri Lanka 2nd Test. Kohli & Ashwin are appreciative of their effort అభిమానుల కోహ్లీకి ఏ శుభముహూర్తాన 'రన్ మెషిన్' అని పేరు పెట్టారేమో గానీ అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. బౌలర్లను ఊచకోత కోయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ చెలరేగి డబుల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఎన్నో మైలు రాళ్లను అందుకున్నాడు. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం నాటి సెంచరీ కోహ్లీకి కెప్టెన్‌గా 12వ సెంచరీ కావడం విశేషం. దీంతో అంతకు ముందు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 11 సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించాడు. ఈ రికార్డుతో తృప్తి చెందని కోహ్లీ తన పరుగుల వేటను కొనసాగించి డబుల్ సెంచరీ చేశాడు. దీంతో, టెస్ట్ కెరీర్లో ఐదు డబుల్ సెంచరీలను నమోదు చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా (5 డబుల్ సెంచరీలు) రికార్డును సమం చేశాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కోహ్లీ చేసిన ఐదు డబుల్ సెంచరీలు కెప్టెన్‌గా చేసినవే. భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడు గా కోహ్లీ (5) అరుదైన ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు చెరో 6 డబుల్ సెంచరీలు చేయగా, రాహుల్ ద్రవిడ్ 4 చేశాడు.